హైదరాబాద్: రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలనే లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి కాంగ్రెసు ఎంత దూరమైనా వెళ్లాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌తో పొత్తు కుదరని పక్షంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడితో జత కట్టేందుకు కూడా కాంగ్రెసు వెనకాడబోదని జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనే అంశాన్ని పూర్తిగా జీర్ణించుకున్న కాంగ్రెసు పార్టీ ఎత్తులు జిత్తులు వెస్తోందని అంటున్నారు. గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెసు పార్టీ 33 లోకసభ సీట్లు గెలుచుకుంది. వచ్చే ఎన్నికల్లో కనీసం 30 సీట్లయినా వస్తేనే రాహుల్ గాంధీని ప్రధానిని చేయగలుగుతామనే అంచనాలో కాంగ్రెసు అధిష్టానం ఉంది. ఇందుకు గాను, జగన్‌తో దోస్తీ కట్టేందుకు మజ్లీస్ అధినేత అసదుద్దీన్‌ను వాడినట్లు చెబుతున్నారు. కాంగ్రెసు మధ్యవర్తిగా వెళ్లిన అసదుద్దీన్ కాంగ్రెసుతో తెగదెంపులు చేసుకునే పరిస్థితి వచ్చింది. ఉమ్మడి శత్రువు జగన్ కాబట్టి కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు వచ్చే ఎన్నికల్లో ఓ అవగాహనకు వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదని అంటున్నారు. అయితే, తెలుగుదేశం పార్టీ పుట్టుకే కాంగ్రెసు వ్యతిరేక పునాదుల మీద జరిగింది. అందువల్ల కాంగ్రెసుతో జత కట్టడానికి చంద్రబాబు అంగీకరిస్తారా అనేది ఓ ప్రశ్న. అయితే, మైనారిటీలకు దూరమవుతామనే ఆందోళనతో చంద్రబాబు పూర్తిగా బిజెపికి దూరమయ్యారు. మళ్లీ ఎన్డీయెతో వెళ్లే పరిస్థితిలో చంద్రబాబు లేరు. చంద్రబాబుకు అధికారంలోకి రావడానికి అదే చివరి అవకాశమనే మాట కూడా వినిపిస్తోంది. ఈసారి తెలుగుదేశం గెలవకపోతే ఎప్పటికీ గెలవలేదనే అభిప్రాయం ఆ పార్టీలోనే వ్యక్తమవుతోంది. సీమాంధ్రలో వైయస్ జగన్ స్వీప్ చేస్తారనే అభిప్రాయం బలంగా ఉంది. రాష్డ్ర విభజన ద్వారా తెలంగాణలో అత్యధిక లోకసభ స్థానాలు గెలుచుకోగలమని కాంగ్రెసు అనుకుంటోంది. సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీతో అవగాహనకు రావడం ద్వారా శాసనసభా స్థానాలను వదిలేసి, లోకసభ స్థానాలను గెలుచుకోవాలనే ఉద్దేశంతో కాంగ్రెసు పార్టీ ఉంది. అయితే, అంతా చంద్రబాబు మీదే ఆధారపడి ఉంటుంది. చంద్రబాబు కాంగ్రెసుతో కలుస్తారనేది ఇప్పటికైతే మిలియన్ డాలర్ల ప్రశ్నే.